Alla Nani : నేడు టీడీపీ గూటికి ఆళ్ల నాని.. రగులుతున్న తమ్ముళ్లు..!?
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ(YCP) పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు అండగా ఉన్న నేతలే పార్టీని వీడుతుండడం కేడర్ ను తీవ్రంగా కలవరపెడుతోంది. బాలినేని శ్రీనివాస రెడ్డి, మోపిదేవి వెంకటరమణ తదితరులు ఇప్పటికే పార్టీని వీడారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన మరో నేత ఆళ్ల నాని(Alla Nani). రెండు నెలల కిందటే పార్టీకి రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారు. ఆయనిప్పుడు టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ అయింది. నాని టీడీపీలో చేరితో పార్టీ మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఆళ్ల నాని అంటే మాత్రం ఎవరైనా గుర్తు పడతారు. దాదాపు పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్న నాని.. కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. ఆయన మరణానంతరం జగన్ పార్టీలో చేరారు. పార్టీ ప్రారంభం నుంచి జగన్ వెంటే నడుస్తున్నారు. అందుకే జగన్ అధికారంలోకి రాగానే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. తాజా ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో నాని రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే రెండు నెలల కిందటే వైసీపీకి రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారు.
అయితే ఆళ్ల నాని జనసేనలో చేరేందుకే వైసీపీకి రాజీనామా చేశారని వార్తలొచ్చాయి. అయితే ఆయన అనుచరులంతా టీడీపీలో చేరుతూ వచ్చారు. ఏలూరులో వైసీపీ కేడర్ అంతా దాదాపు ఖాళీ అయింది. మరోవైపు ఆళ్ల నాని అనుచరులంతా రాజకీయాల్లో ఖాళీగా ఉండడం సరికాదని.. ఏదో ఒక పార్టీలో చేరాలని ఆయనకు సూచించినట్లు సమాచారం. దీంతో విజయనగరం జిల్లాకు చెందిన ఓ టీడీపీ మిత్రుడి ద్వారా చంద్రబాబు, లోకేశ్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావడం, గోదావరి జిల్లాల్లో మంచి పట్టుండడంతో టీడీపీ అధిష్టానం కూడా ఆళ్ల నాని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయనకు ఏ పదవీ హామీ ఇచ్చినట్లు తెలియట్లేదు.
ఇవాళ అమరావతిలో కేబినెట్ భేటీ అనంతరం ఆళ్ల నాని చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు హాజరు కావాలని సమాచారం పంపించినట్లు సమాచారం. అయితే ఆళ్ల నాని చేరికను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏలూరులో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత నాని అవసరం ఏముందని వాళ్లు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆళ్ల నాని లాంటి కీలక నేతల అవసరం పార్టీకి ఉందని.. ఆయనే కాకుండా మరో ఇద్దరు వైసీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు కూడా పార్టీలో చేరబోతున్నారని కేడర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లాలో వైసీపీ లేకుండా చేయాలనే ఆలోచనతోనే చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు వివరించింది. దీంతో తమ్ముళ్లు కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది.













