అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం… భయం వద్దు : ఆళ్ల నాని
ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ఆస్పత్రుల్లో మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్రంలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం గురువారం భేటీ అయ్యింది. వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని అధ్యక్షత వహించారు. మంత్రులు బొత్స, కన్నబాబు, బుగ్గన, ఆదిమూలపు సురేశ్, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు, మంత్రులు సమన్వయంతో ముందుకు సాగాలని ఈ భేటీ నిర్ణయించింది. 104 కాల్ సెంటర్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆళ్లనాని హెచ్చరించారు. ప్రస్తుతం 360 మెట్రిక్ ట్ననుల ఆక్సిజన్ అవసరం అవుతోందని, ఆక్సిజన్ కోసం ఇతర రాష్ట్రాలతో చర్చిస్తూనే, సొంత ప్లాంట్ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు వేగిరం చేశామని నాని వెల్లడించారు. అందుకే కేంద్రం కూడా సహాయం అందిస్తామని పేర్కొందని వెల్లడించారు. ఔషధాలు, ఆక్సిజన్ కొరత అనేది దేశ వ్యాప్తంగా ఉందని, ఏపీలో అలా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 49 లక్షల మందికి టీకాలు వేశామని, అయితే 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ విషయంలో ఇంకా స్పష్టత రావాలన్నారు. శుక్రవారం ఇదే విషయంపై సీఎం జగన్తో సమావేశమవుతామని, ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.













