మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా పోరాటం : చంద్రబాబు
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుతోన్న మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే రేపటి తరాలకు కలిగే నష్టాలకు అంతా బాధ్యులవుతారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అందుకే ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంధ్రులందరిదీ ఒకే మాట.. ఒకే రాజధాని అని చాటాలని కోరారు. విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా ప్రణాళికాబద్దమైన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకునే అవకాశం వచ్చిందన్నారు. రాజధానిగానే కాకుండా 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపద సృష్టి, యువతకు ఉపాధి కేంద్రంగా ఆ నగరాన్ని నిర్మించాలనుకున్నామని చంద్రబాబు సృష్టం చేశారు.
ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేలా ప్రజారాజధాని అమరావతిని నిర్మించేందుకు ఆనాడు సంకల్పించామన్నారు. రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం రాజధాని ప్రాంత రైతులు 33 వేల ఎకరాల భూములను త్యాగం చేయగా, ఆనాడు అమరావతి శంకుస్థాపన కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి పవిత్రస్థలాల మట్టిని, నీటిని పంపించి రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్ష, ఆమోదాన్ని తెలిపారని గుర్తు చేశారు. అలా ఊపిరిపోసుకున్న అద్భుత రాజధాని అమరావతి నగారాన్ని ఈరోజు శిధిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.













