చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతు.. జగన్ సర్కార్ డిఫెన్స్ పడిందా..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీ నేతలు, ఆయన తరపు న్యాయవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అన్ని పిటిషన్లను న్యాయస్థానాలు 19వ తేదీకి వాయిదా వేశాయి. దీంతో మంగళవారం వరకూ ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయనకు మద్దతుగా దేశవిదేశాల్లో మద్దతు ర్యాలీలు జరుగుతున్నాయి. జీ20 సమావేశాల సందర్భంగా చంద్రబాబును అరెస్టు చేసి ప్రపంచదేశాల ముందు ఆయన్ను దోషిగా నిలబెట్టామని జగన్ ప్రభుత్వం సంబరపడుతుంటే.. ఇప్పుడు దేశవిదేశాల్లోని టీడీపీ అభిమానులు చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో జగన్ సర్కార్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది జగన్ ప్రభుత్వం. ఆయనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే దాన్ని సమర్థంగా అణచివేసి సక్సెస్ అయింది ప్రభుత్వం. అక్కడక్కడా నిరసన ర్యాలీలు చేపట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసింది. దీంతో రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయనకు మద్దతుగా వీలైన ప్రతిచోటా తమదైన శైలిలో ర్యాలీలు, సభలు నిర్వహించాలనుకున్నారు చంద్రబాబు అభిమానులు. ఇప్పుడు ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట చంద్రబాబుకు అనుకూల ర్యాలీలు చేపడుతున్నారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాక ఈ కేసులో అసలు విషయాలను పక్కన పెట్టారని డిజైన్ టెక్ సంస్థ ఎండీ మొదటిసారి మీడియాకు వీడియో రిలీజే చేశారు. ఆ తర్వాత సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ కూడా తాజాగా ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడించే ప్రయత్నం చేశారు. నారా లోకేశ్ జాతీయ మీడియా సంస్థలకెళ్లి సత్తా చాటారు. మరోవైపు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో చంద్రబాబుకు అనుకూల ర్యాలీలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో కూడా చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. యూరోప్, ఆఫ్రికా ఖండాల్లో కూడా ఐ యామ్ విత్ చంద్రబాబు అని ఆయన అభిమానులు హోరెత్తిస్తున్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు పేరెత్తకుండా చేశామని సంబరపడుతున్న ప్రభుత్వానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు వస్తున్న మద్దతు చూసి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది జగన్ ప్రభుత్వం. అందుకే తమ వాదనను సమర్థించుకునేందుకు సీఐడీ విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీలాంటి చోట్ల ప్రెస్ మీట్లు పెడుతోంది. ఢిల్లీలో ప్రెస్ మీట్ కు తెలుగు మీడియాను అనుమతించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ కేసులో వాస్తవాలు లేవని.. చంద్రబాబును కావాలని ఇరికించారని చెప్పేందుకు ఇంతకుమించిన ఉదాహరణలు అక్కర్లేదని టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. చంద్రబాబు విషయంలో న్యాయస్థానాల తీరుపై కూడా టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.













