Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి నోటి దూల..! స్వయంకృతాపరాధంతో పికిల్స్ బిజినెస్ ఢమాల్..!!
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి (Rajahmundry) చెందిన అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) వ్యవహారం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘నోటి దూల ఎంతటి వారినైనా నేల చూపులు చూసేలా చేస్తుంది’ అనే నానుడికి ఈ ఘటన తాజా ఉదాహరణగా నిలిచింది. అలేఖ్య చిట్టి (Alekhya Chitti) అనే యువతి తన సిస్టర్స్ తో కలిసి నడుపుతున్న పచ్చళ్ల వ్యాపారం నిర్వహిస్తోంది. ఒక కస్టమర్‌తో జరిగిన సంభాషణ ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. కస్టమర్ ఒకరు పచ్చళ్ల ధరల గురించి ప్రశ్నించగా, అలేఖ్య ఆడియో సందేశంలో అసభ్యకరంగా బూతులు (Vulgar language) తిట్టింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయింది. ఈ ఘటన ఆమె వ్యాపారాన్ని మాత్రమే కాకుండా, వ్యక్తిగత జీవితాన్ని కూడా బజారున పడేసింది.
అలేఖ్య తన సిస్టర్స్ చిట్టి, రమ్యలతో కలిసి రాజమండ్రిలో వెజ్, నాన్-వెజ్ పచ్చళ్ల వ్యాపారం నడుపుతోంది. రొయ్యలు, చేపలు, క్రాబ్, చికెన్ వంటి నాన్-వెజ్ పచ్చళ్లతో వీరు స్థానికంగా మంచి గుర్తింపు సంపాదించారు. అయితే, ఒక కస్టమర్ రూ.3వేల విలువైన రొయ్యల పచ్చడి ధర గురించి అడిగినప్పుడు, అలేఖ్య మర్యాదను మరచి అభ్యంతరకర భాషలో విరుచుకుపడింది. ఆ ఆడియో సందేశం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆమె ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. కస్టమర్ దేవుడితో సమానం అంటూ ఆమె వైఖరిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఒక్క ఘటన ఆమె వ్యాపారాన్ని తాత్కాలికంగా మూసివేసే స్థాయికి తీసుకెళ్లింది.
సోషల్ మీడియా ద్వారా విమర్శలు, ట్రోల్స్ వెల్లువెత్తడంతో అలేఖ్యపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాలతో ఆమె మానసికంగా కుంగిపోయి ఆసుపత్రి పాలైంది. ఆదివారం ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. తప్పు చేశాను.. క్షమించండి అంటూ వీడియో విడుదల చేసింది. అయిన ఆమెపై ట్రోలింగ్స్ ఆగట్లేదు. ‘అప్పుడు రెచ్చిపోయి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి నోరు జారితే దాని పరిణామాలు ఎంత దూరం వెళతాయో ఈ ఒక్క ఘటన నిరూపిస్తోంది.
ఈ వివాదంలో కొందరు అలేఖ్యను సమర్థించే వాళ్లు కూడా ఉన్నారు. ఆమె వ్యాపారాన్ని నాశనం చేసేందుకు కొందరు కుట్ర చేసి ఉండొచ్చని వాదిస్తున్నారు. ఆ ఆడియో ఫోర్జరీ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. అయితే ఆవిడే స్వయంగా సారీ చెప్పడంతో అలాంటి వాళ్లంతా ఇప్పుడు కామ్ అయిపోయారు. ఆవిడ చేసింది తప్పేనని ఒప్పేసుకుంటున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారా లక్షల్లో ఆదాయం పొందిన ఈ సిస్టర్స్ ఇప్పుడు అదే మాధ్యమంలో విమర్శలతో కుంగిపోయారు. యాంకర్ సుమ కూడా ఈ ట్రోలింగ్‌ను ఆపాలని ప్రజలను కోరారు. కానీ తాకిడి మాత్రం ఆగలేదు.
వ్యాపారంలో కస్టమర్ కు గౌరవం ఇవ్వాలి. అలాగే వ్యాపారస్తులకు సహనం ఉండాలి. అలేఖ్య స్వయంగా తన తండ్రి చివరి రోజుల్లో ‘మంచిగా ఉండు’ అని చెప్పిన మాటలను ప్రస్తావించింది. తన క్షమాపణలో పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కానీ, ఒక్కసారి జరిగిన తప్పును వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని, దాని ఫలితాలను అనుభవించక తప్పదని ఈ ఘటన రుజువు చేసింది. ఒక చిన్న పొరపాటు కూడా వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని, కస్టమర్లతో సంబంధాలు కాపాడుకోవడంలో విఫలమైతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది.













