సీఎం కేసీఆర్తో కుమ్మకై… ఏపీకి తీవ్ర అన్యాయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కుమ్మకైన జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై సీఎం జగన్ వ్యాఖ్యలు గురిగింజ మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. జగన్ తండ్రి వైఎస్ చేసిన అవినీతిని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. చంద్రబాబుపై ఆరోపణలు చేయడం తప్ప జగన్ పోలవరంకు చేసింది శూన్యమని విమర్శించారు. ప్రతి ఏడాది పోలవరం జాతీకి అంకితం చేస్తామని చెబుతూనే ఉన్నారని, ఒక్క ఎకరానికీ మూడేళ్లలో నీళ్లు ఇవ్వలేక పోయారని విమర్శించారు.
వ్యవసాయం అంటే ఏంటో జగన్కు తెలియదన్నారు. ఇరిగేషన్ మీద జగన్ ప్రభుత్వానికి అసలు అవగాహన లేదని, రాష్ట్రంలో ప్రాజెక్టులన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. చంద్రబాబు చేపట్టిన పట్టిసమీ వల్ల కృష్ణా డెల్టా రైతులు సంతోషంగా బతుకున్నారని అన్నారు. పట్టిసీమను కూడా నిర్వీర్యం చేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.













