Turaka Kishore: జైలు వద్ద ఉద్రిక్తత.. తురకా కిషోర్ అరెస్ట్ పై హై డ్రామా..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం హయాంలో, గత ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు అన్న చర్చ చురుకుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్నారు. మరికొందరు కొద్దిరోజుల క్రితమే విడుదలై తిరిగి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే మాచర్ల (Macherla) మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్ (Turaka Kishore) వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తురకా కిషోర్‌పై గతంలో దాఖలైన పలు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే ఆయన విడుదలైన వెంటనే పోలీసులు మరో కేసు పెట్టి మళ్లీ అరెస్ట్ చేయడం గమనార్హం. కిషోర్ విడుదలవుతారని తెలిసిన వెంటనే ఆయన భార్య, కుమార్తెతో పాటు కుటుంబసభ్యులు గుంటూరు (Guntur) జైలు వద్దకు చేరుకున్నారు. కిషోర్ బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమయంలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కొంత గందరగోళం నెలకొని, కిషోర్ భార్య పోలీసులు అరెస్ట్ చేయవద్దని అడ్డుకున్నారు. అయినా వారు పట్టించుకోకుండా ఆయన్ను తీసుకెళ్లారు.
ఈ అరెస్టు కారణంగా గుంటూరు జైలు వద్ద కొంత సేపు హైడ్రామా చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, రెంటచింతల (Rentachintala) ప్రాంతంలో టీడీపీ కార్యకర్తపై జరిగిన దాడి కేసులోనే ఈ అరెస్టు జరిగిందని తెలుస్తోంది. గతంలో కిషోర్‌పై ప్రభుత్వం మొత్తం 12 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇందులో 11 కేసులు హత్యాయత్నానికి సంబంధించినవే కాగా, ఒకటి పీడీయాక్ట్ (PD Act). ఈ పీడీయాక్ట్‌ను కోర్టు తొలగించగా, మిగిలిన కేసుల్లో ఇటీవల ఆయనకు బెయిల్ లభించింది. కానీ మరో కొత్త కేసు కారణంగా ఆయనను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.
తురకా కిషోర్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సన్నిహితుడిగా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బుద్దా వెంకన్న (Buddha Venkanna), బోండా ఉమ (Bonda Uma) కారుపై జరిగిన దాడి ఘటనలో కిషోర్ పేరు మొదట వినిపించింది. ఆ ఘటన తర్వాతే ఆయన మున్సిపల్ ఛైర్మన్ పదవిని స్వీకరించారు. ఇప్పుడు మరోసారి జైలు నుంచి వచ్చిన వెంటనే మరొక సారి తిరిగి ఆయన అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.