కాకినాడను స్మార్ట్‌సిటీగా అభివృద్ది చేసి చూపిస్తా : చంద్రబాబు
కాకినాడలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు మరువలేని విజయాన్నందించారని, కాకినాడను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ పార్టీని గెలిపించిన కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రాంతాలు, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నించాయనీ, సంక్షోభాన్ని సృష్టించాలని చూసిన ప్రజలు నమ్మలేదన్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని, వ్యవసాయంలో మనం నంబర్ వన్‌గా ఉన్నామని పేర్కొన్నారు. పట్టుదలతో పట్టిసీమను పూర్తిచేసి చూపించామని, అదే బెదిరింపులకు లొంగిపోయుంటే పట్టిసీమ నిర్మాణం పూర్తయ్యేదా? అని అన్నారు. నీరు లేకపోతే ఈ పాటికి డెల్టా ఎడారిలా మారేదన్నారు. ప్రభుత్వాలు ఇస్తోన్న ప్రోత్సాహం వల్లే తెలుగు యువత క్రీడల్లోనూ అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారని ప్రశంసించారు. ఐదేళ్లకొకసారి మాత్రమే ఎన్నికలు రావాలని అభిప్రాయపడ్డారు. మొన్న నంద్యాల ఉప ఎన్నిక, ఈ రోజు కాకినాడ పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ శ్రేణులు బాగా పనిచేశాయని ప్రశంసించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అని తేడాలేకుండా అంతా సాధారణ కార్యకర్తల్లాగే పనిచేశారని కొనియాడారు.













