ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్‌దాసు?
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌కు అవకాశం దక్కనుందని తెలిసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీలం సాహ్నీ డిసెంబర్ నెలాఖరుకు రిటైర్ కానున్నారు. ఆమె స్థానంలో దాస్‌కు అవకాశం ఇచ్చే అంశాన్ని ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. నీటిపారుదల శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్న ఆదిత్యనాథ్‌దాసు ను తాజాగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఎ)గా నియమించిన సంగతి తెలిసిందే.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆనవాయితీ మేరకు సీసీఎల్ఏగా ఉన్న అధికారికే సీఎస్ పదవిని కట్టబెట్టడుతున్నారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన వారిలో 90 శాతానికి పైగా సీసీఎల్ఏగా పనిచేసి వచ్చిన వారే. అయితే, ఆదిత్యనాథ్‌కు సీఎస్ పదవి లభిస్తే ఆయన దానిలో కొనసాగేది ఆరు నెలలు మాత్రమే. ఆయన వచ్చే ఏడాది జూన్ 30కి పదవీ విరమణ చేయనున్నారు. సీఎస్ పదవి కోసం మరో సీనియర్ అధికారి సతీష్‌చంద్ర, నీరబ్‌కుమార్ ప్రసాద్ ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి అవకాశాలు కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది.













