అధికారం మాదే.. త్వరలోనే వారంతా జైలుకు : ప్రకాశ్ జావడేకర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది నేతలు బెయిల్ పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావడేకర్ మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ మూడు కుటుంబ పార్టీలే అని అన్నారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైకాపా రెండు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఏపీలో విధ్వసంకర పాలన సాగుతోంది. మధ్య నిషేధం అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏవీ జగన్ నెరవేర్చలేదన్నారు.
కేంధ్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు, మోదీ కాలనీలు. నా హయాంలోనే పోలవరానికి అనుమతులు వచ్చాయి. అనుమతులు ఇచ్చి ఏడేళ్లయిన పోలవరం పూర్తి చేయలేదన్నారు. అమరావతి కోసం అటవీ భూములను బదిలీ చేశాం. రాజధాని విషయంలో టీడీపీ, వైకాపా ఘర్షణ పడుతున్నాయి. ఈ రాష్ట్రానికి మేలు చేసే నాయకత్వం తప్పక అవసరం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని అన్నారు.













