Posani Arrest: పోసాని అరెస్టుపై పోలీసులకు చిత్తశుద్ధి ఉందా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali). సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉండేవి ఆయన మాటలు. చిన్నాపెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా ఆయన నీచాతినీచమైన భాష ఉపయోగించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ తో పాటు వాళ్ల కుటుంబీకులపై పోసాని చేసిన కామెంట్స్ ని ఎవరూ మర్చిపోలేరు. ఆయనపై గత ప్రభుత్వంలోనే ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం (NDA Govt) అధికారంలోకి రావడంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగానే పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు (Posari Arrest) చేశారు.
శివరాత్రి వేళ హైదరాబాద్ మైహోం భూజా అపార్ట్ మెంట్స్ (My Home Bhuja) లో నివాసముంటున్న పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా (Annamayya District) సంబేపల్లి (Sambepalli) పోలీసులు ఆయన భార్యకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆయన్ను అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె (Obulavari Palle) పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోసాని కృష్ణ మురళిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా జనసేన నేత ఓబులవారి పల్లెలో పోసానిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇన్నాళ్లుగా నమోదైన కేసుల్లో పోలీసులు ఎందుకు తాత్సారం వహించారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోసాని కృష్ణ మురళి మీడియా ముందుకొచ్చి ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను గతంలో మాట్లాడిన మాటలన్నింటికీ సారీ చెప్పారు. చంద్రబాబు మంచోడని పొగిడారు. దీంతో ఆయన జోలికి పోలీసులు వెళ్లలేదు. పోసాని కూడా మిగిలిన నిందితుల లాగా కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందలేదు. వాస్తవానికి పోసానిని అరెస్టు చేసేందుకు అన్ని ఆధారాలున్నాయి. ఆయన మీడియా ముందు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, రెచ్చేగొట్టేలా ఉన్న మాటలు చాలు ఆయన్ను అరెస్టు చేయడానికి.! కానీ కూటమి ప్రభుత్వం పోసాని అరెస్టు వరకూ వెళ్లలేదు. బహుశా చంద్రబాబు సాఫ్ట్ కార్నరే ఇందుకు కారణమై ఉండొచ్చు.
అయితే పవన్ కల్యాణ్, లోకేశ్ లాంటి వాళ్లు మాత్రం పోసాని సహా నాడు రెచ్చిపోయిన వారందరిని వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు. కచ్చితంగా తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా వీళ్లిద్దరి బలవంతం మీదే పోలీసులు అరెస్టు దాకా వెళ్లారని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని అర్థమవుతోంది. 26వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇచ్చిన నోటీసుల్లో మాత్రం 27వ తేదీ వేశారు. ఇక ఓబుళవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్ట్ అయినట్లు నోటీసులో పేర్కొన్నారు. కానీ సంతకం మాత్రం సంబేపల్లి ఎస్సై సంతకం ఉంది. ఇవి పోలీసుల అలసత్వానికి నిదర్శనాలు. ఇలాంటి సీరియస్ కేసుల్లో కూడా పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చేలా ఉంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే పోలీసులు, అధికారులు కూడా లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.













