Anitha Vangalapudi: అవినీతి ఆరోపణలతో ఏపీ హోంమంత్రి అనిత ప్రైవేట్ పీఏపై చర్యలు..
ఏపీ హోంమంత్రి (AP Home minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ప్రైవేట్ పీఏ జగదీశ్‌పై (P.A Jagadeesh) గత కొద్దికాలంగా జోరుగా సాగుతున్న అవినీతి ఆరోపణల పై ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. అనేక దశాబ్దాలుగా అనితకు ప్రైవేట్ పీఏగా కొనసాగుతున్న జగదీశ్ మీద బదిలీలు, పోస్టింగులు, సిఫార్సులు వంటి వాటి కోసం అక్రమంగా అతను డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి అనిత హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అతని దందా మరింత పెరిగింది అని టాక్.ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై వేటు పడింది.
అనిత హోంమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగదీశ్ అవినీతికి మరింత ప్రోత్సాహం లభించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతటి ప్రముఖ నాయకుడైనా పట్టించుకోకుండా, ఆయనే అన్నీ తానే అన్నట్లు వ్యవహరించడం, కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతని కారణంగా ఎందరో ఇబ్బందుల పాలు కూడా అయినట్లు తెలుస్తోంది.
జగదీశ్‌పై వచ్చిన ఆరోపణలు అతనికి కష్టాలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించిన వాటాల కోసం లైసెన్సుదారులపై ఒత్తిడి చేయడం, తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలను తిరుపతిలోని ఓ హోటల్లో అమ్మడం వంటి పనులపై పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ప్రభుత్వానికి పలువురు బాధితులు ఫిర్యాదులు పంపించడంతో సమస్య మరింత తీవ్రమైంది. దీంతో హోంమంత్రి అనిత ఎట్టకేలకు జగదీశ్‌ను తన పీఏ పదవి నుంచి తొలగించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. జగదీశ్‌ను తొలగించడంతో ప్రభుత్వం అవినీతి వ్యవహారాలను ఉపేక్షించదన్న సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ చర్య అనిత పరిపాలనపై వస్తున్న విమర్శలకు సమాధానం అవుతుందా లేదా అన్న విషయంపై కూడా చర్చ సాగుతోంది.అవినీతి ఆరోపణలు రోజురోజుకు పెరుగుతుండటంతో అనిత కూడా కాస్త జాగ్రత్తలు తీసుకొని.. తన పాలన తీరును మార్చుకోక తప్పదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి అనిత ఈ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.













