Gorantla Madhav: గోరంట్ల మాధవ్ ఇష్యూలో పోలీసులపై వేటుకు రంగం సిద్ధం..!?
ప్రస్తుతం ఏపీలో YCP మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వ్యవహారం ఆసక్తి రేపుతోంది. టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran).. వైఎస్ భారతిరెడ్డిపై (YS Bharathi Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్తున్న చేబ్రోలు కిరణ్ పై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గోరంట్ల మాధవ్ కు కిరణ్ ఆచూకీ చెప్పడం, కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుకునేందుకు అవకాశం కల్పించడం లాంటివి ఇప్పుడు విమర్శలకు తావిచ్చాయి. దీంతో గోరంట్ల మాధవ్ కు సహకరించిన పోలీసులపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఐటీడీపీ (ITDP) కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు ఇబ్రహీంపట్నంలో (Ibrahimpatnam) అదుపులోకి తీసుకుని గుంటూరు (Guntur) తరలించారు. కిరణ్ గుంటూరు చేరుకోగానే ఆయన్ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనాన్ని గోరంట్ల మాధవ్ వెహికల్ వెంబడించి అడ్డుకుంది. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని కిరణ్ పై దాడికి గోరంట్ల మాధవ్ ప్రయత్నించారు. ఈ సందర్భంగా అక్కడ పెద్ద హడావుడి జరిగింది. చివరకు గోరంట్ల మాధవ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
గోరంట్ల మాధవ్ సహా ఇతర నిందితులను మీడియా ముందు హాజరు పరిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఇందుకు గోరంట్ల మాధవ్ నిరాకరించారు. వాళ్లతో వాగ్వాదానికి దిగారు. చివరకు చేసేదేం లేక గోరంట్ల మాధవ్ ను కోర్టుకు తీసుకెళ్లారు. మిగిలిన ఐదుగురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. గోరంట్ల మాధవ్ ఎక్కడని మీడియా అడగడంతో ఆయన్ను మళ్లీ వెనక్కు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే మాధవ్ అందుకు నిరాకరించారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని మీడియా ముందు ప్రవేశ పెడతారా అంటూ పోలీసులతో ఘర్షణకు దిగారు. చివరకు చేసేదేం లేక కోర్టులో హాజరు పరిచారు. ఆయన్ను రిమాండ్ కు తరలించారు.
మరోవైపు.. కోర్టు విచారణ సమయంలో మాధవ్ సెల్ ఫోన్ తో మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కస్టడీలో ఉన్న వ్యక్తికి ఫోన్ ఎవరు అందించారనే దానిపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అంతేకాక.. కిరణ్ ను ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేసి గుంటూరు తరలిస్తున్నారనే సమాచారాన్ని కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ఓ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ కు చేరవేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితుడి ఆచూకీ చెప్పడం, కస్టడీలో ఫోన్ మాట్లాడేందుకు సహకరించడం లాంటి వాటిపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాధవ్ కు ఉప్పందించిన వారితో పాటు ఆయనకు సహకరించిన వారిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో వారిపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం.













