వైసీపీలో బ్లడ్ బాయిల్ చేస్తున్న అచ్చెన్నాయుడు ట్వీట్స్
ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితి మరీ ఎక్కువైంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. ట్వీట్స్ తో హీట్ పుట్టిస్తున్నారు. తాజాగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ట్వీట్స్ వైసీపీ నేతల్లో సెగలు రేపాయి. అచ్చెన్నాయుడిపై వైసీపీ నేతలు భగ్గుమనేలా చేస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నేతలు అచ్చెన్నాయుడు ట్వీట్స్ పై రగిలిపోతున్నారు.
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటాల తూటాలు పేలిన సంగతి తెలిసింది. ఇదే క్రమంలో అచ్చెన్నాయుడు కూడా వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా జగన్ బాబాయ్ వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్యకేసును అజెండా తీసుకుని విమర్శలు గుప్పించారు. తాజాగా ఆ అంశాలనే మరోసారి ట్వీట్ చేశారు అచ్చెన్నాయుడు. వివేకా హత్య కేసులో తమ ప్రమేయం లేదని లోకేశ్ ప్రమాణం చేశారని.. కానీ జగన్ మాత్రం బాత్రూమ్ లో శవం ఉండగానే ఓట్లు దండుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. నారా లోకేశ్ చేసిన ప్రమాణానికి సీఎం జగన్ స్పందించట్లేదని ప్రశ్నిస్తూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. ఇవి ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.
అచ్చెన్నాయుడు ట్వీట్స్ చూసిన వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అచ్చెన్నాయుడు ట్వీట్ చూస్తుంటే రక్తం మరిగిపోతోందని.. మంత్రి పదవిలో ఉన్నప్పటికీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని మంత్రి సీదిరి అప్పల్రాజు అన్నారు. జగన్ గురించి ఇంకోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు. అలాగే స్పీకర్ తమ్మినేని కూడా అచ్చెన్నాయుడు ట్వీట్లపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. స్పీకర్ పదవిలో ఉన్నందున తనకు పరిమితులున్నాయన్న తమ్మినేని సీతారాం.. అందుకే కంట్రోల్ చేసుకుంటున్నట్టు చెప్పారు. అచ్చెన్న ట్వీట్లు చూసి బ్లడ్ బాయిల్ అయిపోతోందున్నారు. తాము కూడా ట్వీట్లు చేయడం ప్రారంభిస్తే స్పేస్ కూడా సరిపోదన్నారు.
మొత్తానికి హూ కిల్డ్ బాబాయ్ పేరుతో అచ్చెన్నాయుడు చేసిన ట్వీట్లు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అచ్చెన్నాయుడికి స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇచ్చేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. టీడీపీపైనా, లోకేశ్ పైనా అచ్చెన్నాయుడు టంగ్ స్లిప్ అయినా.. ఆయన చెప్పినవి వాస్తవాలేనంటూ వైసీపీ నేతలు అంటున్నారు. తాము బహిరంగంగా చెప్తున్న విషయాలనే ఇప్పుడు అచ్చెన్నాయుడు నాలుగు గోడల మధ్య చెప్పారంటున్నారు. అయితే వైసీపీ నేతల మాటలు పట్టించుకోని అచ్చెన్నాయుడు రివర్స్ అటాక్ కు దిగారు. అందుకే ఘాటుగా ట్వీట్లు చేశారు. ఇప్పుడివి వైసీపీలో మరింత అగ్గి రాజేస్తున్నాయి. మరి ఇవి ఏ టర్న్ తీసుకుంటాయనేది వేచి చూడాలి.













