ఒక్క సంతకంతో ఆ కేసులన్నీ ఎత్తేస్తాం : అచ్చెన్నాయుడు
చంద్రబాబు సీఎం అయ్యాక ఒకే ఒక్క సంతకంతో ఆ కేసులన్నీ తీసేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఒంగోలులో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో అచ్చెన్నాయుడు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచితీరుతుందని అన్నారు. ఆ గెలవడం మామూలుగా ఉండకూడదని, 160 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. ఈ మూడేళ్లలో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. బలహీనవర్గాల్లో 80 శాతం మంది టీడీపీతో ఉన్నట్లు సీఎంకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండటంతోనే వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టారని తెలిపారు. ఆ బస్సుయాత్రలో వస్తోంది అలీబాబా 40 మంది దొంగలని అన్నారు. మూడేళ్లలో ఏం చేశారని బస్సుయాత్రలో మంత్రులను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అందజేస్తున్న పథకాలను ఎత్తేశారని, వాటన్నింటిపైనా నిలదీయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. అధికారం ఉన్న లేకున్నా నిరతరం ప్రజల మధ్య ఉండే పార్టీ టీడీపీ అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చిందని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోరి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీని జగన్ ఏమీ చేయలేరని అన్నారు.













