తిరుపతిలో టీడీపీదే విజయం
తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీదే విజయమని, ఈ విషయాన్ని అన్ని నివేదికలు సృష్టం చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ మంత్రులతో అచ్చెన్న సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని వైకాపా కార్యాలయంగా మార్చేశారని విమర్శించారు. తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలని ముఖ్యమంత్రి నిత్యం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైకాపా దాడులకు ఎదురొడ్డి పోరాడుతున్న కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు.













