ప్రశ్నిస్తే దాడులు… నిలదీస్తే హత్యలు
వైకాపా నేతలు ఏపీని హత్యల ఆంధప్రదేశ్గా మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో టీడీపీ మాజీ సర్పంచి అంకులును దారుణంగా హత్య చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్యలతో టీడీపీ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి టీడీపీ అన్ని విధాల అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
తలకెక్కిన వైకాపా అహంకారాన్ని, మదాన్ని దించే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. వైకాపాని ప్రజలు మోకాళ్ల మీద నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే వారానికొక టీడీపీ కార్యకర్తను పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో క్రూరత్వానికి జగన్ పాలు పోసి పెంచుతున్నారని వ్యాఖ్యానించారు. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రవ్యాప్తం చేసి ఏపీని రావణకాష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ నియంత పాలనలోనూ లేని అరాచకాలు, దౌర్జన్యాలు జగన్ పాలనలో చూస్తున్నామని ఆక్షేపించారు. ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే హత్యలు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొల్పారని ఆందోళన వ్యక్తం చేశారు.













