ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న!
ఆంధప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అద్యక్షుడిగా మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడి పేరు దాదాపు ఖరారైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 27న రాష్ట్ర కార్యవర్గాన్ని, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ అధ్యక్షులను ప్రకటించనున్నారు. రాష్ట్ర కార్యవర్గం ఎంపికపై ఆయన ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఇది వరకే పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకుల అభిప్రాయం తెలుసుకున్నారు. అచ్చెన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి, బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనను అధ్యక్షుడిగా నియమించడం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందన్న అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమైనట్టు సమాచారం.
చంద్రబాబు శనివారం అమరావతికి వస్తారని, ఆదివారం నాడు ఆయనే కమిటీలను ప్రకటించే అకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జిల్లా కమిటీలకు బదులుగా ఈసారి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించబోతున్నారు. ఈ నెల 27న లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ అధ్యక్షుల్ని మాత్రం ప్రకటిస్తారని, మిగతా కార్యవర్గం నియామకం ఆ తర్వాత చేపడతారని సమాచారం













