లక్ష్మీపార్వతికి ఏసీబీ షాక్… చంద్రబాబు ఆస్తులపై
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. తగిన ఆధారాలు లేవని పిటిషన్‌కు విచారణార్హత లేదంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీ పార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ప్రారంభం కాకముందే చంద్రబాబు ఇంఫ్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు ఎలా వింటామని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. తర్వాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్‌పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లో స్టేట్ విధించారు. అనంతరం స్టే ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు కొట్టివేసింది. స్టే కొనసాగుతుండగా సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించి ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది.













