కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,050.91 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలకు రెవెన్యూ లోటు భర్తీ కింద, అలాగే రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,050.91 కోట్లను ఆంధప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద ఏప్రిల్ నెలకు కేంద్ర ప్రభుత్వం రూ.491.41 కోట్ల విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు రూ.491.41 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,491 కోట్లను రాష్ట్రానికి సిఫార్సు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,119 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్‌గా రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.













