సీబీఐ విచారణకు ఏబీ డిమాండ్.. లేకుంటే కోర్టుకే..!!
రక్షణకు సంబంధించిన నిఘా పరికరాల కొనుగోలు వ్యవహరాంలో అవినీతికి పాల్పడేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై సస్పెండ్ అయిన మాజీ ఇంటెలిజెన్స్ చీప్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తన కేసును సీబీఐతో విచారణ చేయించాలంటూ ఆయన తాజాగా చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్‌కు లేఖ రాశారు. 9 పేజీల లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. తనపై వచ్చిన ఆరోపణలకు బదులివ్వడంతో పాటు.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆయన 9 పత్రాలను కూడా జతచేసినట్లు తెలుస్తోంది.
ఏబీ వెంకటేశ్వర రావుపై సంస్థాగత విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఇటీవలే ఈ విచారణను పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే ఈ విచారణ సందర్భంగా పలు అంశాలను విచారణాధికారులు ఏబీ వెంకటేశ్వర రావు ముందుంచారు. వాటిని చూసిన ఏబీ వెంకటేశ్వర రావు.. అవి ఫోర్జరీ చేసినట్లు విచారణాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు వాటినే ఆధారాలుగా చేసుకుని ఏబీ వెంకటేశ్వర రావు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
తనపై కుట్ర జరిగిందని.. కొంతమంది ఉన్నతాధికారులే కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారని ఏబీ వెంకటేశ్వర రావు చెప్తున్నారు. ఎంక్వయిరీస్ కమిషనర్ జరిపిన విచారణ సందర్భంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని.. వాటినే విచారణ సందర్భంగా తన ముందు పెట్టారని వివరించారు. అవి పూర్తిగా నిరాధారమైనవని ఏబీ వెంకటేశ్వర రావు చెప్తున్నారు. వాటిపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
సీఎస్ స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ రూపొందించుకునేందుకు ఏబీ వెంకటేశ్వర రావు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. సీబీఐ విచారణకు సిద్దంగా లేకపోతే.. కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోంది. ఈ పోర్జరీ డాక్యుమెంట్ల తీరు చూస్తుంటే.. 1994లో జరిగిన నంబి నారాయణన్ ఉదంతంలాగా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. నంబి నారాయణన్ కేసులో కేరళ ప్రభుత్వం కోటి 30 లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. తన కేసులో కూడా సీబీఐ విచారణతో పాటు పరిహారం కోరుతూ కోర్టు తలుపులు తట్టేందుకు ఏబీ వెంకటేశ్వర రావు సిద్ధమవుతున్నారు.
రిపోర్టులను క్రాస్ చెక్ చేయకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా కొంతమంది ఉన్నతాధికారులు వ్యవహరించారని ఏబీ వెంకటేశ్వర రావు ఆరోపిస్తున్నారు. వారికి సంబంధించిన పత్రాలను సమర్పిస్తూ సీఎస్ కు లేఖ రాశారు. సీఎస్ స్పందించకపోతే ప్రభుత్వంతో పలువురు ఉన్నతాధికారులను కూడా కోర్టుకు లాగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడీ వ్వవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













