ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట
సీనియర్ ఐపీఎస్ అధికార ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు ఆంధప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన విషయంలో తొందరపడవద్దని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏబీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌గా డీజీగా ఉన్న సమయంలో పరికరాల కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని చూస్తోందని, వారంతాల్లో ఏదో విధంగా అరెస్ట్‌కు యత్నిస్తోందని ఏబీవీ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసి 48 గంటలు జైల్లో ఉంచి తర్వాత మళ్లీ సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా నిలువరించాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం, డీజీపీకి మధ్యంతర ఉత్తర్వులు ఇవాల్వని ఆయన విజ్ఞప్తి చేశారు. విచారణలో భాగంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఓవైపు ఎలాంటి కేసుల నమోదు కాకుండానే ముందస్తు బెయిల్‌కి ఎలా పిటిషన్ వేస్తారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.













