Perni Nani: గుడివాడ దాడి ఘటనపై పేర్ని స్కెచ్ ..ఏపీ రాజకీయాలలో మరో ట్విస్ట్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress party) చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) మరోసారి వివాదం లో చిక్కుకున్నారు . “తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు” అన్న సామెత ఆయన దృష్టికి రాకపోవడమే ఈ దురవస్థకు కారణం అన్న విమర్శలు వస్తున్నాయి. గుడివాడ (Gudivada) లో జరిగిన ఓ ఘటనకు సంబంధించి ఆయన వేసిన రాజకీయ స్కెచ్ బయటపడటంతో పెద్ద దుమారం రేగింది. ఫోన్ సంభాషణ లీక్ కావడంతో ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. నోటికి ఏది తోస్తే చెప్పే పేర్ని నానికి ఈసారి ఆ అలవాటు కారణంగా ఇరుకున్నారు . రాజకీయ పరంగా పక్కాగా ప్లాన్ చేసినా, దాన్ని అమలు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విస్మరించడంతో ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
గుడివాడ జెడ్పీ ఛైర్‌పర్సన్ (Gudivada ZP Chairperson) కారుపై జరిగిన దాడి వ్యవహారాన్ని ఓ బీసీ మహిళపై జరిగిన దాడిగా చూపించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పేర్ని నాని ఇచ్చిన సూచనలు బయటకు వచ్చాయి. ‘ఆమె బీసీ గౌడ్ మహిళ, పైగా లోకేశ్ (Lokesh) చెప్పడంతో టీడీపీ (TDP) ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారని ప్రచారం చేయాలి. మన నాయకుడు ఆదేశిస్తేనే మన కార్యకర్తలు వినిపిస్తారు. అందరినీ కలుపుకుని కులపరంగా ఉద్యమాలు చేయాలి’ అన్న మాటలు ఆడియోలో వినిపించాయి. దీనిని బట్టి ఆయనకు ఉన్న రాజకీయ తెలివితేటలు ఎలాంటివో తెలుస్తోంది. కానీ ఇలాంటి గోప్యమైన విషయాలు బయటకు రావడం అతని ప్రణాళికల్ని తిరస్కరించేలా చేసింది.
ఇప్పటికే తన మాటలతో పార్టీకి ఇబ్బందులు తెచ్చిన పేర్ని నాని, తాజా వ్యవహారంతో మరింత దుష్ఫలితాల్ని ఎదుర్కొంటున్నట్టు అనిపిస్తోంది. పార్టీని రక్షించాలన్న నెపంతో పెట్టిన స్కెచ్ తో చివరకు పార్టీకి ఇబ్బంది కలిగించడమే కాకుండా, తనను కూడా ఇరుకున పెట్టింది. ఈ పరిస్థితిలో ఆయన పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ? ఆ లీకైన కాల్ వీడియోపై ఆయన వివరణ ఏంటి? అనే అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాలంటే తెలివిగా వ్యవహరించాలి, కానీ దాన్ని అమలు చేసే ముందు కొన్ని అంశాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ విషయాన్ని పేర్ని నాని ఈ ఘటనతో నేర్చుకుంటారో లేదో చూడాలి.