New Party: ఏపీలో కాపు-దళిత నినాదంతో కొత్త పార్టీ..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై మరో కొత్త అధ్యాయం మొదలుకానుందా? గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ముందు డీలాపడ్డ ప్రతిపక్షం.. ఇప్పుడు సరికొత్త వ్యూహానికి తెరలేపుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న ప్రచారం ప్రకారం.. ఏపీలో కాపు, దళిత సామాజిక వర్గాల కలయికతో ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. సస్పెండెడ్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ వ్యూహ రచన, దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశ భాగస్వామ్యంతో ఈ కొత్త శక్తి తెరపైకి రాబోతోందని విశ్వసనీయ సమాచారం.
కొంతకాలం క్రితం సస్పెండెడ్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. “కాపులు, దళితులు ఏకతాటిపైకి వస్తేనే రాజ్యాధికారం సాధ్యం. కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పీఠం, దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కాలి” అనేది ఆయన ప్రతిపాదన. ఒక మాజీ అధికారిగా కాకుండా, ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లా ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందనేది బలంగా వినిపిస్తున్న ఆరోపణ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించి, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ముద్ర పడిన సునీల్ కుమార్.. ఇప్పుడు తెరవెనుక ఉంటూ ఈ కొత్త రాజకీయ ప్రయోగానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త సమీకరణంలో ప్రధాన ఆకర్షణ వంగవీటి ఆశ. దివంగత వంగవీటి మోహన రంగాకు కాపు సామాజిక వర్గంలో ఉన్న ఆరాధన భావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విశాఖలో నిర్వహించిన ‘రంగా సేన’ ఆత్మీయ సమ్మేళనం ఈ కొత్త పార్టీ ఊహాగానాలకు ఊపిరి పోసింది. ఈ సభలో కాపులతో పాటు దళితులు, బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగా ఆశయ సాధన కోసం కొత్త వేదిక అవసరం అని మెజారిటీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. వంగవీటి రాధా రాజకీయంగా మౌనంగా ఉంటున్న తరుణంలో, రంగా వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ఆయన ఇమేజ్ ద్వారా కాపు యువతను ఆకర్షించడానికి వంగవీటి ఆశను ముందు పెడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం కాపు ఓట్ల ఏకీకరణ. పవన్ కళ్యాణ్ చొరవతో కాపు ఓట్లు గంపగుత్తగా కూటమికి పడ్డాయి. ఇది వైసీపీని కోలుకోలేని దెబ్బ తీసింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ ఓటు బ్యాంకును చీల్చకపోతే వైసీపీకి భవిష్యత్తు కష్టమే. అందుకే, నేరుగా వైసీపీలో చేరలేని కాపు, దళిత వర్గాలను ఆకర్షించడానికి ఒక మూడో ప్రత్యామ్నాయం లేదా కొత్త పార్టీ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే.. రంగా సెంటిమెంట్ ను వాడుకుని కాపు ఓట్లను చీల్చడం, దానికి దళిత ఓట్లను జత చేయడం ద్వారా కూటమి ఓటు బ్యాంకుకు గండి కొట్టాలనేది మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తోంది. పీవీ సునీల్ కుమార్, వంగవీటి ఆశలతో పాటు మరికొందరు వైసీపీ సానుభూతిపరులు, మేధావులు ఈ పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
అయితే, కేవలం సామాజిక సమీకరణాలతో పార్టీని నడపడం అంత సులభం కాదు. వంగవీటి ఆశకు క్షేత్రస్థాయిలో రాజకీయ అనుభవం తక్కువ. పవన్ కళ్యాణ్ లాంటి ఛరిష్మా ఉన్న నేత ముందు ఆమె ఎంతవరకు నిలబడగలరనేది ప్రశ్న. గతంలో కాపు, దళిత సామాజిక వర్గాలను ఏకం చేయడానికి జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బీఎస్పీ-జనసేన పొత్తు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ రెండు వర్గాల మధ్య క్షేత్రస్థాయిలో ఉన్న అంతరాలను చెరిపివేయడం కత్తి మీద సాము లాంటిది. అన్నిటికీ మించి ఈ కొత్త పార్టీ వెనుక జగన్ మోహన్ రెడ్డి ఉన్నారనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళితే, అది అంతిమంగా ఆ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
మొత్తానికి, ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోందన్నది కాదనలేని సత్యం. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో యాక్టివ్ అయ్యేలా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఇది కేవలం ఓట్ల చీలిక కోసమే పుడుతోందా? లేక నిజంగానే బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యామ్నాయ వేదిక అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.






