ఏపీ శాసనసభ నుంచి.. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడీవేడీగా కొనసాగాయి. సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచీ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపిచారు. ఈ క్రమంలో ఐదుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్మేలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగంపై చర్చకు అడ్డుపడుతున్నారని వారిని బడ్జెట్ సమాశాలు పూర్తయ్యే వరకు సప్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీ శాసనసభా పక్ష ఉప నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతో పాటు ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డోలా బాలా వీరాంజనేయ స్వామిని సభ నుంచి సప్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ సభ్యులను సప్పెండ్ చేయడంపై మిగిలిన టీడీపీ ఎమ్మెలు సభలో ఆందోళనకు దిగారు.













