వారానికి 5 రోజుల పని… మరో ఏడాది పొడిగింపు

వారానికి 5 రోజుల పని విధానం మరో ఏడాదిపాటు ఆంధప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 5 రోజుల పని విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలతో పాటు, కార్పోరేషన్లలో ఉద్యోగులు వారానికి ఐదు రోజులే విధులకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పని చేయాలన్న ప్రభుత్వం జూన్ 27 నుంచి ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉద్యోగుల తరపున ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.