నాలుగు లేన్లుగా రాయలసీమ రహదారుల అభివృద్ధి
రాయలసీమలోని నాలుగు జిల్లాలను అనుసంధానిస్తూ మెరుగైన రోడ్ కనెక్టివిటీని అభివృద్ధి చేయడంతోపాటు, రూ.7,392 కోట్లతో 528 కి.మీ. మేర నాలుగు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించేందుకు కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసింది. అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టి వచ్చే ఏడాది పనులు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదన పట్ల జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) సానుకూలంగా స్పందించింది. ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.
వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి బద్వేలు మీదుగా నెల్లూరు వద్ద చెన్నై%–%కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 149 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారిని అభివృద్ధి చేస్తారు. అందుకోసం రూ. 2,086 కోట్లతో ప్రతిపాదనలకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. అనంతపురం నుంచి మైదుకూరు వరకు 154 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ. 2,156 కోట్లతో ప్రతిపాదనలకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. కర్నూలు నుంచి డోర్నాల వరకు 131 కి.మీ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఇందుకోసం రూ.1,834 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. చిత్తూరు జిల్లాలో మదనపల్లి నుంచి తిరుపతి వరకు 94 కి.మీ.మేర నాలుగు లేన్ల రహదారిని రూ. 1,316 కోట్లతో నిర్మిస్తారు.













