ఏపీలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు రేపు (ఫిబ్రవరి 13) జరగనున్నాయి. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు రెండవ విడత పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని 18 డివిజన్లలో 167 మండలాల్లోని 2786 పంచాయితీలకి ఎన్నికలు ఉండనున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో మద్యాహ్నం 1:30 గంటల వరకే పోలింగ్ నిర్వహించిన సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక ప్రక్రియ జరగనుంది.
రెండవ విడతకి నోటిఫికేషన్ ఇచ్చిన మొత్తం పంచాయతీలు 3328 కాగా, వాటిలో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 33,570 వార్డులు ఉండగా, వాటిలో 12,604 ఏకగ్రీవమయ్యాయి. అయితే 149 వార్డుల్లో నో నామినేషన్ ఉండటంతో 20,817 వార్డులకి ఎన్నికలు జరగనున్నాయి. 44,876 మంది అభ్యర్థులు వార్డులకి పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 29,304 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 5480 సమస్యాత్మక కేంద్రాలు ఉండగా, 4181 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు.













