23.. చంద్రబాబుకు కలిసిరాని నెంబర్..!
ప్రతి ఒక్కరి జీవితం కొన్ని నెంబర్లతో ముడిపడి ఉంటుంది. కొంతమంది కొన్ని నెంబర్లను అదృష్ట సంఖ్యగా భావిస్తుంటారు. మరికొంతమంది కొన్ని నెంబర్లను చూస్తేనే చాలు.. భయపడి పారిపోతుంటారు. ఇప్పుడు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఒక నెంబర్ చూస్తే అలాగే ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. అదే 23. ఈ నెంబర్ ఆయనకు ఏమాత్రం కలిసొచ్చినట్లు లేదు. 23 నెంబర్ తో చంద్రబాబునాయుడుకి చాలా సంబంధాలున్నాయి. అవన్నీ ఆయన కోరుకున్నవి కాదు. కాలాతీతంగా తనతో ముడిపడినవే. ఇష్టం ఉన్నా.. లేకపోయినా వీటిని కాలక్రమంలో అంగీకరించాల్సిందే.
చంద్రబాబునాయుడికి, 23 నెంబర్ కు ఉన్న సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రతిపక్షంలో ఉన్న 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తనవైపుకు తిప్పుకున్నారు. కేవలం పార్టీలో చేర్చుకోవడానికే పరిమితం కాకుండా.. ఏకంగా మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించారు. ఇలా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, వాళ్లకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
కాలం మారింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు టీడీపీకి వచ్చిన సీట్లు 23. అంటే నాడు వైసీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలనైతే తనవైపు తిప్పుకున్నారో.. ఇప్పుడు టీడీపీకి దక్కిన సీట్లు అన్నే.! అంతే కాదు.. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చింది కూడా 2019 మే 23న.! 23వ తేదీన 23 సీట్లు మాత్రమే దక్కాయంటూ వైసీపీ నేతలు అప్పట్లో సెటైర్లు వేశారు.
23తో ఇంకో అంశం కూడా చంద్రబాబు నాయుడికి ముడిపడి ఉంది. అదే శాసన మండలి రద్దు. అసెంబ్లీలో పూర్తి పట్టున్న వైసీపీకి శాసన మండలిలో మాత్రం అంత పట్టు లేదు. అక్కడ టీడీపీ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. మండలిలో పాస్ చేసిన బిల్లులను మండలిలో ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటోంది. దీనిపై విసుగు చెందిన అధికార పార్టీ.. ఏకంగా మండలినే రద్దు చేయాలని తీర్మానించింది. ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది జనవరి 23న..! సో.. ఇది కూడా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించిన పరిణామమే.
ఇప్పుడు అమరావతి అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ.. చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చింది. దీనిపై విచారణకు రావాలని ఆదేశించింది. చంద్రబాబునాయుడు మార్చి 23న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. సో.. ఇప్పుడు కూడా 23 నెంబర్ చంద్రబాబునాయుడికి ఇబ్బందిగా మారింది. ఇవన్నీ చూసినవాళ్లు చంద్రబాబునాయుడికి 23 నెంబర్ కలిసిరావట్లేదని చర్చించుకుంటున్నారు.













