కర్నూలులో కొత్తగా 11 ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్
ఏపీలోని కర్నూలు జిల్లాలో కోవిడ్ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రభుత్వం కట్టడికి నడుం బిగించింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 11 ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులను సిద్ధం చేశామని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
కస్తూర్బా పాఠశాలలో 53 మందికి కరోనా
కర్నూలు జిల్లా ఆదోని కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో కరోనా కలకలం రేగింది. మొత్తం 300 మంది విద్యార్థులుండగా,వారిలో 53 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనిపై డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించారు. కర్నూలు జిల్లా ముఖ్య వైద్యాధికారికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులు, సిబ్బందులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆళ్ల నాని ఆదేశించారు.
ఏపీలో కొత్తగా ఆరు వేల కేసులు
ఏపీలో గడచిన 24 గంటల్లో 35,922 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 6,582 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కాగా గత 24 గంటల్లో కరోనా బారి నుంచి 2,343 మంది క్షేమంగా కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం 44,686 కేసులు యాక్టివ్గా ఉన్నాయని, ఇప్పటి వరకు ఏపీలో 1,56,77,992 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.













