లింబో స్కేటింగ్లో ఒకేరోజు నాలుగు గిన్నిస్ రికార్డులు
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన దేవీశ్రీ ప్రసాద్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లింబో స్కేటింగ్లో ఒకేరోజు నాలుగు గిన్నిస్ రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్కేటింగ్లో ఈ రికార్డులను కైవసం చేసుకున్నాడు. అరవై కార్ల కింద నుంచి 115 మీటర్ల ముందుకి, వెనక్కి స్కేటింగ్ చేశాడు. అనంతరం బార్స్ కింద నుంచి 185 మీటర్లు ముందుకు, 165 మీటర్లు వెనక్కి స్కేటింగ్ చేశారు. ఒకే రోజు నాలుగు రికార్డులను సొంతం చేసుకోవడం అరుదైన విషయమని గిన్నిస్ రికార్డు ప్రతినిధి స్వప్నిల్ దాంగేరికర్ తెలిపారు. ఈ సందర్భంగా బాలుడికి క్రీడ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ పీవీ సింధు, శాప్ ఎండీ కోమటి కిశోర్ తదితరులు అభినందనలు తెలిపారు.













