Medical Colleges: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రభుత్వం తప్పు చేస్తోందా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష వైసీపీతోపాటు ప్రజా ఆరోగ్య వేదిక (PAV), విద్యార్థి సంఘాలు, సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను (Govt Medical Colleges) నిర్మించతలపెట్టింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వంటి ప్రాంతాలలో 2023-24 నుంచే ఇవి ప్రారంభమయ్యాయి. కాలేజీల నిర్మాణం ద్వారా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 2,360 నుంచి 4,910కి పెంచాలనేది అప్పటి ప్రభుత్వ లక్ష్యం. ఈ కాలేజీలలో సగం సీట్లను ఉచితంగా, మిగిలినవాటిని ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే తక్కువ రుసుముతో అందించాలని నిర్ణయించారు. దీనివల్ల నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని భావించారు.
2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ (TDP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి ప్రభుత్వం, ఈ 17 కళాశాలలలో పదింటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. అదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వంటి ప్రాంతాలలోని కాలేజీ 2027-28 నాటికి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత, మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఆర్థిక పరిమితుల వల్లే వీటిని ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) వెల్లడించారు.
పీపీపీ మోడల్‌పై విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజా ఆరోగ్య వేదిక (PAV) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది వైద్య విద్యను, ఆరోగ్య సేవలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తుందని ఆరోపించింది. ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ప్రైవేటు సంస్థలు లాభాపేక్షతో పనిచేస్తాయని, దీనివల్ల వైద్య విద్య రుసుములు గణనీయంగా పెరిగి, నిరుపేద విద్యార్థులకు అవకాశాలు తగ్గుతాయని వారు హెచ్చరించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. 2019 వరకు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా, తమ ప్రభుత్వం 17 కొత్త కళాశాలలను ప్రారంభించిందని గుర్తు చేశారు. పీపీపీ మోడల్ ద్వారా ఈ కళాశాలలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని, ఆరోగ్యశ్రీ పథకం బలహీనపడుతుందని ఆయన ఆరోపించారు.
పీపీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అనంతపురంలో ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ సమితి సంయుక్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాయి. విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీపీపీ విధానాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ఆమోదించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందుబాటులో ఉన్న శస్త్రచికిత్సలు, వైద్య సేవలు పీపీపీ మోడల్‌లో చెల్లింపు ఆధారితంగా మారే ప్రమాదం ఉందని వైద్యవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. పీపీపీ మోడల్‌లో కళాశాలల నిర్వహణ హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయని, రుసుముల పెంపు ఉండదని ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 59% అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. అయితే ఈ వాదనలు ప్రజలను సంతృప్తి పరచట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకుంటే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి.