సిద్ధూ అకౌంట్ల సీజ్…కాంగ్రెస్ ఆగ్రహం
కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పంజాబ్ రాష్ట్రమంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధూ చేత ప్రచారం చేయించాలనుకున్న కాంగ్రెస్ ఆశలపై నీళ్ళు చల్లేలా ఆదాయపుపన్ను అధికారులు వ్యవహరించారు. సిద్ధూ బ్యాంక్ అకౌంట్లను ఆదాయపన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. 2014-15 సంవత్సరంలో దాఖలు చేసిన ట్యాక్స్ రిటర్న్స్ లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై గతేడాది జనవరిలోనే సిద్ధూకు ఐటీ అధికారులు నోటీసులు పంపించారు. అదనంగా రూ.52 లక్షల పన్ను కట్టాల్సి ఉంటుందని నోటీసులో తెలిపారు. ఆ నోటీసులపై సిద్ధూ అప్పీలుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషనర్ పన్ను కట్టాల్సిందేనని తీర్పు ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ల సీజ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.













