ఈ అర్ధరాత్రి నుంచి భారత్ లాక్ డౌన్ : మోడీ
ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి భారత్ లాక్ డౌన్ ను ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా వైరస్ను కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్డౌన్ తప్పదని ఆయన స్పష్టం చేశారు. లాక్డౌన్ మూడు వారాలు ఉంటుందని చెప్పారు. ఇది ఒకరకంగా కర్ఫ్యూ వంటిదేనని అన్నారు. రాబోయే 21 రోజులు ప్రతి ఒక్కరికీ కీలకమని వ్యాఖ్యానించారు. దేశానికి ఇది పరీక్షా సమయమని, నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సంక్లిష్ట సమయంలో అందరూ సహకరించాలని, సామాజిక దూరం పాటించడమే ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పరిష్కారమని అన్నారు. దయచేసి ఈ 21 రోజులూ ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రావద్దని చేతులు జోడించి ప్రార్ధిస్తున్నానని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ లక్ష్మణ రేఖను దాటకూడదని కోరారు. ఎవరికీ ఇబ్బంది రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయని, నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకువస్తాయని చెప్పారు. వదంతులు నమ్మవద్దని చెప్పారు.ఆయన కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ స్నేహితులను, దేశాన్ని కాపాడటానికి కఠిన నిర్ణయం తప్పడం లేదని అన్నారు. ఈ లాక్ డౌన్ ను అందరూ పాటించాలని అన్నారు. వారం వ్యవధిలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఇది రెండో సారి. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్నదని మోడీ అన్నారు. ఈ మహమ్మారిపై పోరులో భారత్ విజయం సాధిస్తుందన్నారు. అందుకు ప్రజాసహకారం అవసరమన్నారు. కరోనా సంక్రమించిందన్న విషయం ముందు ఎవరూ గుర్తించలేరన్నారు. వ్యాధి లక్షణాలున్న వారే కాకుండా అందరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. తాను ప్రధానిగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిలా చెబుతున్నానని, ఈ మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.













