ఎవరికీ భయపడేది లేదు : మోహన్ భగవత్
దేశ భద్రత, రక్షణ విషయంలో తాము ఎవరికీ భయపడేది లేదని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం చెప్పారు. అంతేకాదు, ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్ఠను మోదీ ప్రభుత్వం పెంచిందని ఆయన ప్రశంసించారు. డోక్లాంలో రెండు నెలలకు పైగా భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను ఇరుదేశాలు పరస్పరం పరిష్కరించుకొన్న నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత, రక్షణ విషయంలో దేశం ఎంతమాత్రం భయపడబోదనే విషయాన్ని ఈ ఉదంతం చాటిచెప్పిందని భగవత్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందాలో దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ పేరుతో ఏర్పాటు చేసిన కాలేజీలో ఆయన స్మృత్యర్థం నిర్వహించిన ఒక కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు.













