కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హజ్ యాత్రికులకు ఇచ్చే రాయితీని ఉపసంహరించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. మైనారిటీలకు సాధికారత కల్పించడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. మైనారిటీలకు సంతుష్టీకరణ లేకుండా, గౌరవ, మర్యాదలతో సాధికారులను చేసే విధానంలో భాగంగా హజ్ సబ్సిబీని ఉపసంహరించినట్లు చెప్పారు. సబ్సిడీ కోసం ఉద్దేశించిన నిధులను మైనారిటీల విద్యాభివృద్ధి, ఆ సమాజంలోని బాలికల సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం రికార్డు సంఖ్యలో 1.75 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్తున్నారని తెలిపారు. 2022 నాటికి హజ్ సబ్సిడీని క్రమంగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు 2012లో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 1,300 మంది మహిళలు హజ్ యాత్రకు వెళ్తున్నారు. 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసుగల మహిళలు కనీసం నలుగురు బృందంగా ఏర్పడితే, వారితోపాటు పురుష సహచరుడు లేకపోయినా హజ్ యాత్ర చేసేందుకు అనుమతి లభించడంతో ఈ సంవత్సరం మహిళా యాత్రికుల సంఖ్య పెరిగింది.













