ధర్మపోరాట దీక్షను జయప్రదం చేయాలి
ప్రత్యేక హోదా విభజన హామీల అమలులో కేంద్రం చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షను జయప్రదం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. 20న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న ధర్మపోరాట దీక్షకు జిల్లా నలుమూలల నుండి రైతులు, మహిళలు, విద్యార్థులు భారీ స్థాయిలో తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దీక్షా కార్యక్రమానికి తరలివచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రిని ప్రజలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకుని వేదిక ప్రాంగణం మొత్తం టెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. దీక్ష వేదిక ప్రాంగణంలో అత్యవసర సేవలను అందించేందుకు వైద్య సిబ్బంది, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు.













