న్యూఢిల్లీ పాలవ్యాపారి 13 ఏండ్ల నిరీక్షణ ఫలించింది
-మృతిచెందిన 19 బర్రెలకు రూ.20 లక్షల పరిహారం
-ఢిల్లీ ప్రభుత్వం, వైద్యులకు వినియోగదారుల కమిషన్ ఆదేశం
న్యూఢిల్లీ, నవంబర్ 27: ఓ పాలవ్యాపారి 13 ఏండ్ల నిరీక్షణకు మంచి ఫలితం దక్కింది. ప్రభుత్వ పశువైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందిన 19 బర్రెలకుగాను పాల వ్యాపారికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. చికిత్స అందించిన ఢిల్లీ ప్రభుత్వ పశువైద్యశాల వైద్యులు, ఢిల్లీ ప్రభుత్వ పశుసంరక్షణ విభాగం సంయుక్తంగా ఈ మొత్తాన్ని నాలుగువారాల్లోగా చెల్లించాలని జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలోని కమిషన్ బెంచ్ స్పష్టంచేసింది. ఢిల్లీకి చెందిన శంభుదయాల్ (45) అనే వ్యక్తి 22 బర్రెలను పెంచుతూ.. పాలు విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 2004లో శంభుదయాల్ వద్ద ఉన్న 19 (మూడింటికి తప్ప) బర్రెలకు స్థానిక ప్రభుత్వ పశువైద్యులు ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే మూడురోజుల వ్యవధిలో 19 బర్రెలు మృత్యువాతపడ్డాయి. వైద్యుల నిరక్ష్యంతోనే అవి మృతిచెందాయని, తనకు పరిహారం ఇప్పించాలని కోరుతూ బాధితుడు జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. 22 బర్రెల్లో 19 మృతిచెందడంతో డెయిరీ మూతపడిందని, బతుకుదుర్భరంగా మారిందని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలోని కమిషన్ బెంచ్ విచారణ చేపట్టింది. నిరక్షరాస్యుడైన, భూమిలేని పాడి రైతు ఆధారాన్ని కోల్పోయాడని పేర్కొన్నది. 2004లో ఒక్కో బర్రె ఖరీదును దృష్టిలో పెట్టుకుని దయాల్‌కు పరిహారం చెల్లించాలని స్పష్టంచేసింది. రూ.9.4 లక్షలకు ఏడాదికి 9శాతం వడ్డీ చొప్పున లెక్కగట్టి.. మొత్తం రూ.20 లక్షలకుపైగా చెల్లించాలని చికిత్స అందించిన వైద్యులు, ఢిల్లీ ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. 13 ఏండ్లుగా నిరీక్షిస్తున్న బాధితుడికి న్యాయంగా పరిహారం చెల్లించాలని సూచించింది. తీవ్రమైన చలి కారణంగానే బర్రెలు మృతిచెందాయని వైద్యులు వివరించగా, వీరి వాదనను కమిషన్ తిరస్కరించింది. ఒకవేళ చలి ఉంటే.. వైద్యం అందించని మిగతా మూడు బర్రెలు ఎందుకు బతికున్నాయి, వాటికి కూడా అంతే చలి ఉంటుంది కదా ప్రశ్నించింది. నాడు పశువులకు ఏ మందులు ఇచ్చారో కూడా సంబంధించిన చీటీలు రికార్డుల్లో పెట్టకపోవడం మిస్టరీగా మారింది.













