50 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టిన మీరాకుమార్
యూపీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన మీరా కుమార్ ఆ ఎన్నికల్లో ఓడినా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇటీవల ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10.69 లక్షల ఓట్లకు గాను మీరాకుమార్‌కు 3.67 లక్షల ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. సిద్ధాంతమే తన లక్షమని చెప్పి ఎన్నికల్లో దిగిన మీరా కుమార్ ఓడినా తన పేరిట మాత్రం ఓ రికార్డును సొంతం చేసుకున్నారు.
1967లో చీఫ్ జస్టిస్ కోక సుబ్బారావు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన జకీర్ హుస్సేన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో సుబ్బారావుకు 3.64 లక్షల ఓట్లు పడ్డాయి. అయితే 50 ఏళ్ల తర్వాత మీరా కుమార్ ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఓడినా ఎక్కువ ఓట్లు గెలిచిన రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా నిలిచారు. ఆ ఎన్నికల్లో సుబ్బారావుకు 43శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ ఇప్పుడు మీరా కుమార్‌కు 34శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే కోవింద్ మాత్రం ఓట్ షేర్లో గతంలో గెలిచిన ప్రెసిడెంట్ల కంటే తక్కువ మెజారిటీతోనే గెలిచారు.













