స్వదేశానికి భారతీయులు ?
లాక్డౌన్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. మే 3తో లాక్డౌన్ గడువు ముగియనుండడంతో ఆ తర్వాతే వారిని భారత్కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరగడంతో కేంద్రం దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం ఓ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విదేశాల్లో చిక్కుకుపోయిన పౌరుల జాబితాను రాష్ట్రాలను కేంద్రం కోరిందని సమాచారం. వారిని భారత్కు తీసుకొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వారు రాష్ట్రాల్లోకి వచ్చిన వెంటనే ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి స్థానిక కరోనా వైరస్ బాధితులలో వారిని కలవకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.













