మన్మోహన్కు ఇందిర శాంతి బహుమతి
2017 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంపికయ్యారు. 2004-2014 మధ్య ప్రపంచ వ్యాప్తంగా శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం దేశం తరుపున నాయకత్వం వహించారు. సింగ్ను అంతర్జాతీయ జ్యూరీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మన్మోహన్ చేసిన కృషి, ప్రపంచ దేశాలతోపాటు పొరుగు దేశాలతో సత్సంబంధాలు, భద్రత, కుల, మత ప్రాంత, భాషా భేదాలు లేకుండా పౌరులందరి శ్రేయస్సును కోరినట్లు ట్రస్ట్ కార్యదర్శి సుమన్ దూబే తెలిపారు. ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు పూర్తి కాలం పని చేసిన మూడో ప్రధాని మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు. ఆర్బిఐ గవర్నర్గా పని చేసిన ఆయన మాజీ ప్రధాని పివి నరసింహారావు మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1986లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని ఏర్పాటు చేశారు.













