ఆ ఎన్నారైల ఆస్తులు జప్తు!
భార్యలను వదిలి విదేశాలకు వెళ్లిపోయి, కోర్టులకు హాజరుకాకుండా, నోటీసులకు కనీసం స్పందించకుండా తప్పించుకుంటున్న ఎన్నారై భర్తలపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతున్నది. వారి ఆస్తుల స్వాధీనానికి వీలు కల్పిస్తూ చట్టంలో కీలకమార్పులు తేవాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడి ఘటనలపై ఎప్పుడైనా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పిస్తూ, మూడేండ్ల నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. భార్యను వదిలేసిన ఎన్నారైకి విదేశాంగ శాఖ వెబ్సైట్ ద్వారా జారీ చేసిన నోటీసు సంబంధిత వ్యక్తికి చేరినట్లు భావించాలని తెలిపారు. ఈ మేరకు చటట సవరణ చేస్తే సంబంధిత ఎన్నారై విచారణ అధికారుల ముందు తప్పకుండా హాజరయ్యే అవకాశాలుంటాయన్నారు.
ప్రస్తుత విధానం ఆలస్యం కావడంతో పాటు సంబంధిత ఎన్నారై ఆచూకీ తెలుసుకోవడం కష్టమనీ మేనకాగాంధీ చెప్పారు. వెబ్సైట్ ద్వారా నోటీసు జారీచేసినా సంబంధిత వ్యక్తి స్పందించకుంటే అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు భావించాలని, అతడు, అతడి కుటుంబసభ్యుల ఆస్తులను జప్తు చేసేలా చట్టంలో పొందుపర్చాలని హోంశాఖను కోరినట్లు చెప్పారు.













