ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల కేసుల పరిశీలనకు ప్రత్యేక విభాగం
ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ)తో వివాహాలకు సంబంధించిన కేసుల కోసం పూర్తిస్థాయిలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ జాతీయ మహిళా సంఘాన్ని (ఎన్సీడబ్ల్యూ) కోరారు. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సదరు కేసులను ఎప్పటికప్పుడు పరిశీలించి పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. వివాహానంతరం ఎన్ఆర్ఐలు నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయిన బాధిత మహిళ కేసులను మేనకాగాంధీ సమీక్షించారు. ఈ కేసులను చూస్తున్న న్యాయవాదులందరూ ఎన్సీడబ్ల్యూ ఏర్పాటు చేసే ఎన్ఆర్ఐ విభాగంలో ప్రతి వారం సమీక్షా సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. ప్రవాస భారతీయుల వివాహాల వివరాలను తక్షణమే సంబంధిత రిజిస్ట్రార్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖకు అందచేసేలా చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఈ ఏడాది జులైలో రాష్ట్రాలను కోరారు.













