భారత్ తో పెట్టుకుంటే ఏమవుతుందో చెప్పిన చైనా నిపుణుడు
డోక్లామ్ సరిహద్దు వివాదంతో భారత్-చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనటం, భారత్ ను చైనా పదే పదే యుద్ధంలో ఓటమి చవిచూడాల్సి వస్తుందంటూ హెచ్చరికలు చేయటం తెలిసిందే. కవ్వింపులతో యుద్ధానికి కాలు దువ్వుతున్న చైనాకు అసలే మాత్రం మింగుడుపడని విషయాన్ని ఆ దేశ మాజీ మిలటరీ అధికారి ఆంటోనీ వోంగ్ వెల్లడించారు. ఆర్మీ ఆపరేషన్లలో నిపుణుడైన వాంగ్.. భారత్ తో యుద్ధం వస్తే చైనా పరిస్థితి ఏమిటనేది వివరించాడు.
భారత్ విషయంలో చైనా వైఖరి ఏమాత్రం సరిగ్గా లేదనీ, ఇది ఏమాత్రం మంచిది కాదనీ చెప్పాడు. ఇలాగే చేస్తూ పోతే చైనాను భారత్ శతృదేశంగా పరిగణిస్తుందనీ, అదే జరిగితే చైనాకు భయంకరమైన ఇబ్బందులు తప్పవనీ హెచ్చరించాడు. యుద్ధంలో చైనా పైచేయి సాధించగలదనీ, కానీ భారత నావికా దళం(ఇండియన్ నేవీ)ని ఎదుర్కునే శక్తి మాత్రం చైనాకు లేదనీ చెప్పాడు. భారత్ ను చైనా ఎంత నాశనం చేయగలదో, భారత్ కూడా చైనాను అంత కంటే ఎక్కువే నాశనం చేయగలదంటూ స్పష్టంగా చెప్పాడు.
భౌగోళికంగా కీలక ప్రాంతంలో ఉన్న పెద్ద దేశమైన భారత్ తో యుద్ధం పెట్టుకుంటే, హిందూ సముద్రం గుండా చైనాకు సరఫరా అయ్యే చమురును నిలిపివేసి చైనాను పూర్తిగా స్తంభింపజేయగలదనీ, అంతే కాకుండా చైనాకు 80 శాతం రవాణా జరిగే మలక్కా జలసంధిపై భారత్ ఆధిపత్యం చెలాయిస్తే కనుక చైనాలోని అన్ని వ్యవస్థలు స్తంభించాల్సిందేనన్నాడు. ఇప్పటికే ఈ ప్రాంతంపై ఆధిపత్యం సంపాదించి చైనాను ఇబ్బందులు పెట్టాలని చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయనీ, భారత్ అలా చేయటం లేదనీ, కానీ భారత్ ను రెచ్చగొడితే మాత్రం ఆ పని చేయటం ద్వారా చైనా పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిని ఒక్కసారిగా నాశనం చేయగలదనీ చెప్పాడు.
తనంతట తానుగా యుద్ధానికి దిగని శాంతి కాముక దేశంగా భారత్ కు పేరుందనీ, అలాంటి దేశంతో స్నేహంగా ఉండి సమస్యలను పరిష్కరించుకుంటే, భారత్ తోడుగా ఉంటే చైనా మరింత అభివృద్ధి సాధిస్తుందనీ, శతృత్వం పెట్టుకుంటే చైనాకు ముప్పేననీ వాంగ్ స్పష్టంగా చెప్పాడు. సరిహద్దుల్లో సైన్యం మోహరింపులు పెంచుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న చైనా అధినాయకత్వం వాంగ్ వాంగ్ మాటలను పట్టించుకుంటుందేమో చూడాలి.













