చేతులు మారిన ‘మహాటీవీ’!
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తెలుగు మీడియాలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారంగా బండినెట్టికొస్తున్న ‘మహాటీవీ’ చేతులు మారింది. ఈ టీవీలో మెజారిటీ వాటాను ప్రవాస భారతీయులు కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఛానల్ ను రీలాంచ్ చేయటంతో పాటు.. ఇక ఆంధ్రప్రదేశ్ ఫోకస్ గానే కార్యకలాపాలు ప్రారంభించాలనే యోచనలో కొత్త యాజమాన్యం ఉంది. వాస్తవానికి ఈ ఛానల్ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుటుంబీకుల చేతుల్లో ఉంది. ఛానల్ వ్యవహారాలను మాత్రం సీనియర్ ఎడిటర్ ఐ. వెంకట్రావు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన్ను కూడా పక్కకు తప్పించేస్తున్నారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ప్రవాస భారతీయులు కొంత మంది ఈ ఛానల్ లో మెజారిటీ వాటా 51 శాతం దక్కించుకున్నారు. మిగిలిన 49 శాతం ప్రస్తుతానికి వ్యవస్థాపక ప్రమోటర్ల వద్దే ఉంటుందని సమాచారం.
ఎప్పటినుంచో ఈ ఛానల్ లో ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వటం లేదు. నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. దీంతో ఛానల్ ను భారంగా ఆగిపోయిన బండి నెట్టినట్లు నెట్టుకువస్తున్నారు. అయితే కొత్త ప్రమోటర్లు రానుండటంతో అయినా ఈ ఛానల్ దశ..దిశ మారుతుందేమో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం అయితే కొత్త కెమెరాలు..ఎక్విప్ మెంట్ కొనుగోలు పనిలో నూతన యాజమాన్యం ఉందని టాక్.













