12 ఏండ్లలోపు పిల్లలపై లైంగికదాడికి పాల్పడితే.. ఉరిశిక్షే
-మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం
భోపాల్, నవంబర్ 27: మహిళలు, చిన్నారులపై లైంగికదాడుల ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. 12 ఏండ్లలోపు పిల్లలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణశిక్ష విధించాలన్న ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతోపాటు సామూహిక లైంగికదాడులకు పాల్పడేవారికీ ఈ శిక్ష వర్తించేలా మరో ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదించింది. అలాగే నిందితులకు విధించే శిక్ష, జరిమానాను పెంచేవిధంగా శిక్షాస్మృతిలో సవరణ చేయాలని కూడా క్యాబినెట్ తీర్మానించింది. మైనర్లపై లైంగిక వేధింపులు పెరుగుతున్న దశలో ఇలాంటి చట్టం ఎంతైనా అవసరమని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్రసింగ్ తెలిపారు. దీంతో నేరాలు తగ్గుముఖం పడుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంత్రివర్గం ఆమోదంతో రాష్ట్ర శిక్షాస్మృతిని సవరించే అవకాశముంది. గత రెండునెలలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లైంగికదాడులు, లైంగికవేధింపుల కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈనెల మొదటివారంలో రాష్ట్ర రాజధాని భోపాల్‌లో 10ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో 67 ఏండ్ల వృద్ధుడు, ఓ మహిళ సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ఇటీవల యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతి కోచింగ్ సెంటర్‌నుంచి ఇంటికి తిరిగివెళ్తుండగా భోపాల్ రైల్వేస్టేషన్ సమీపంలోనే ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనలో కేసు నమోదుకు పోలీసులు నిరాకరించగా, రైల్వేపోలీసులు చివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది. రాజధానిలో చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలనుంచి తీవ్రఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనల నేపథ్యంలో మంత్రివర్గం ఈ తీర్మానం చేసినట్లు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి జయంత్ మాలవీయ తెలిపారు.
మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు.. సెలవుపై వెళ్లమన్న సీఎం
మధ్యప్రదేశ్‌లో మరో లైంగికవేధింపుల ఘటన తెరపైకి వచ్చింది. తనను అదనపు ఎస్పీ రాజేంద్రవర్మ లైంగికంగా వేధించారంటూ ఓ మహిళా కానిస్టేబుల్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపించి, నిందితుడిపై తగు చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీ ఇచ్చినట్లు బాధిత మహిళ తెలిపారు. మూడు నాలుగు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి, ప్రశాంతంగా ఉండాలని సీఎం సూచించినట్లు ఆమె వెల్లడించారు. తాజాగా భోపాల్ రైల్వే డివిజన్లోని భేర్కెరా ప్రాంతంలో పాప్‌కార్న్ అమ్ముతున్న మహిళ(23)ను నడుస్తున్న రైల్లోనే రేప్‌చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అమర్కంటక్ ఎక్స్‌ప్రెస్‌లోని టాయ్లెట్లో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు భోపాల్‌కు చెందిన జీతూగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.













