కాంగ్రెస్ పరిస్థితి కల్లోలమేనా?
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇలాగే జరిగితే ఆ పార్టీ ఉనికి ప్రాంతాలకే పరిమితమవుతుందని చెబుతున్నారు. తాజాగా తన చేతిలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చేజేతులా కోల్పోనున్నదని అంటున్నారు. జ్యోతిరాధిత్య సింధియా రాజీనామాకు దారితీసిన సంఘటనలు పరిశీలిస్తే కాంగ్రెస్ అధినాయకత్వం దీనిని చేజేతులారా చేసుకుందని అర్థమవుతుంది. కేంద్రం జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఈ చర్యకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీర్మా నించింది. దీన్ని ఆనాడే జ్యోతిరాధిత్య సింధియా ఖండించారు. పేరుకు ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ తరతరాలుగా దేశభక్త కుటుంబం నుంచి వచ్చారు. గ్వాలియర్ మహారాజా వంశీకుడాయన.
ఏ పార్టీలో ఉన్న దేశ సమ గ్రత, సార్వభౌమత్వాల కోసం తపిస్తారు. సహజంగానే జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే అంశంలో ఆయన కేంద్రానికి మద్దతిచ్చారు. సొంత పార్టీ కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అప్పట్నుంచి కాంగ్రెస్ ఆయనపై కక్షబూనింది. ఆయన వర్గానికిచెందిన ఎ మ్మెల్యేల్ని ఇబ్బందులకు గురి చేయడం మొదలెట్టింది. ఆయనకిస్తానన్న రాజ్యసభ సభ్యత్వాన్ని పక్కన పెట్టింది. ఇది సింధియా ఆగ్రహానికి కారణమైంది. పరోక్షంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీస్తోంది. మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఏడాదిన్నర తిరక్క ముందే కమల్‌నాధ్ ప్రభుత్వం రాజీనామా చేయక తప్పని పరిస్థితేర్పడింది. కాంగ్రెస్‌లోని మూడు ప్రధాన గ్రూపుల్లో ఒకటి విడిపోయింది. 70ఏళ్ళకు పైబడ్డ కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాధ్, దిగ్విజయ్‌సింగ్‌లు ఎంతగా ప్రయత్నించినా ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడంలేదు. యువనాయకుడు జ్యోతిరాదిత్య సింథియా పార్టీ లోనే ఉంటూ అవమానాల్ని తట్టుకోలేకపోతున్నట్లు తేల్చేశారు. బిజెపితో మంతనాలు మొదలెట్టారు. దీంతో సోనియా, రాహుల్ గాంధీలు సహజంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. సింథియాను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన బిజెపిలో చేరిపోయారు. బిజెపి కూడా సింథియాకున్న కుటుంబ చరిష్మా నేపధ్యంలో ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు సై అంది.
తాజా సంఘటనలతో మధ్యప్రదేశ్‌పై కాషాయజెండా ఎగరడం ఖాయమైపోయింది. రాష్ట్రాల్లోని విపక్ష ప్రభుత్వాల్ని పడగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో ఒకప్పుడు కాంగ్రెస్‌ది అందెవేసిన చేయి. కానీ ఇప్పుడు బిజెపి ఈ విషయంలో కాంగ్రెస్‌ను కూడా మించిపోయింది. ఇప్పటికే కర్ణాటకలో దొడ్డిదారిన ఆ పార్టీ అధికారం చేపట్టింది. కాగా ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అంతర్గత వివాదాల్ని తనకనుకూలంగా మలచుకుంది. ఇప్పటికే సింథియాకు అనుకూలంగా ఉన్న 20మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసేశారు. దీంతో కమల్‌నాధ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వ్యూహాలకు బిజెపి పదునెట్టింది. పరిస్థితిని పూర్తిగా తనకనుకూలంగా మార్చేసుకుంది. ఇందుకు సింథియా కలిసొచ్చారు. గతేడాది మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వానేర్పాటు చేసిం ది. అప్పటికే ప్రభుత్వంలో మూడుగ్రూపులున్నాయి. కమల్‌నాధ్, దిగ్విజయ్‌సింగ్‌లు ప్రతి సందర్భంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జ్యోతిరాధిత్య సింథియాను వీలైనంతగా అణగదొక్కారు. ఆయన అనుయాయులకు తగిన మంత్రిపదవులు దక్కలేదు. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించారు. అదికూడా దక్కే అవకాశాల్లేక పోవడంతో ఇక తప్పనిసరై ఆయన పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
సింథియాకు బలమైన వారసత్వ రాజకీయ సంపదుంది. గ్వాలియర్ మహారాజా వంశీకుడైన సింథియాకు రాజ్యసభ సభ్యత్వమిచ్చేందుకు బిజెపి సిద్దంగా ఉంది. ఆ తర్వాత ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుక్కూడా సిద్దపడుతోంది. తద్వారా మధ్యప్రదేశ్‌లో కోల్పోయిన పట్టును తిరిగి సాధించుకునేందుకు సమాయత్తమౌతోంది. సింథియా నాయనమ్మ విజయరాజెసింధియా బిజెపి వ్యవస్థాపకుల్లో ఒకరు. దీర్ఘకాలం ఆమె బిజెపిలో కీలకనాయకురాలిగా వ్యవహరించారు. జ్యోతిరాదిత్య మేనత్త వసుంధరరాజే కూడా బిజెపి నాయకురాలు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పని చేశారు. ప్రస్తుతం బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇలా బిజెపితో సింథియా కుటుంబానికి విడదీయరాని సంబంధముంది.
మధ్యప్రదేశ్ కాషాయ ఆధిపత్యంలోకొస్తే 2018లో కోల్పోయిన ప్రధాన హిందీ రాష్ట్రాన్ని తిరిగి తన పెత్తనం క్రిందకు తెచ్చుకున్నట్లవుతుంది. ఇది ఖచ్చితంగా ఆ పార్టీలో అమిత్‌షా ఆధిపత్యాన్ని పెంచుతుంది. వాస్తవానికి ప్రస్తుతం నడ్డా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ వ్యవహారాలన్నీ షా కనుసన్నల్లోనే సాగుతున్నాయి. అక్కడి మార్పులపై అమిత్‌షా తన ముద్రేశారు. అలాగే సింథియాను బిజెపిలోకి తేవడంలోనూ ఆయన క•షి ఎక్కువగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి చూస్తే మధ్యప్రదేశ్‌లో డీలా పడిపోవడం ఖాయం. సింథియా పార్టీలో ఉన్నంతకాలం కమల్‌నాధ్, దిగ్విజయ్వర్గాలు కలసిమెలసి వ్యవహరించాయి. కానీ ఇప్పుడీ రెండువర్గాల మధ్య ఆధిపత్య పోరాటం తప్పదు. అలాగే ఈ ఇద్దరు నాయకులు ఏడుపదుల వయసు దాటారు. దీంతో పార్టీలో యువనాయకత్వం కొరత తీవ్రమౌతుంది. అలాగే సోనియా, రాహుల్ నాయకత్వ పటిమపై కూడా మధ్యప్రదేశ్ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్ రాష్ట్రాలపై పట్టును క్రమంగా కోల్పోతే పార్టీ జాతీయస్థాయి ఉనికికి అది ప్రమాదకరంగా తయారవుతుంది.













