కేంద్రంలో చక్రం తిప్పేదెవరు?
ఈసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పేదెవరన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి గాని పూర్తి మెజారిటీ రాని పక్షంలో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ఈ చర్చ సాగింది.. బిజెపి మాత్రం తమ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయనే ధీమాతో ఉంది. ఎన్డీఏకు దీటుగా కూటమిని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్‌తోపాటు, ఇతర విపక్ష పార్టీలు విఫలమైన సంగతి తెలిసిందే. కేవలం యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి మాత్రమే ‘కమలనాథుల’కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎన్డీఏకు 272 సీట్లు రాకుండా ఉండాలంటే యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల్లో భాజపా ఘోరంగా దెబ్బతినాలి. ఎన్డీఏ బలం 200 సీట్లకు పడిపోతేనే ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పే పరిస్థితులు వస్తాయి. ఉత్తరాదిలో కాంగ్రెస్ కోలుకుని, వందకుపైగా సీట్లు తెచ్చుకుంటే- భాజపా తర్వాత రెండవ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. కాని కాంగ్రెస్ ప్రతిపాదించే కూటమిలో చేరేందుకు ఏ పార్టీ ముందుకు వస్తుందో రాదో తెలియదు. 200కు పైగా సీట్లు ఎన్డీఏకి వచ్చాయంటే, ఏదో ఒక ప్రాతిపదికన భాజపాకు మద్దతు ఇచ్చేందుకు చాలా పార్టీలు మాత్రం ఇష్టపడుతున్నాయి. కాంగ్రెస్, భాజపాల్లో ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో టీఆర్ఎస్, వైకాపా, టీడీపీ, బీఎస్పీ, ఎన్సీపీ, ద్రవిడ పార్టీల పాత్ర కీలకం కావొచ్చు.
ప్రస్తుత ఎన్నికల్లో సిద్ధాంతపరమైన విధానాలకు అన్ని పార్టీలూ తిలోదకాలిచ్చాయి. ప్రధాని మోదీని గద్దెదించడమే తమ లక్ష్యమని చాలా ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. గతంలో భాజపాను మతతత్వ పార్టీగా ముద్రవేసిన ఇతర పార్టీలు ఈ రోజు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అంటే భాజపా అంటరాని పార్టీ కాదు. కాని మోదీ విధానాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామనే సిద్ధాంతాన్ని జనంలోకి ప్రాంతీయ పార్టీలు తీసుకెళుతున్నాయి. ఇందులో టీడీపీ, టీఆర్ఎస్, తణమూల్, ఎస్పీ, బీఎస్పీ,ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు ఏదో విధంగా ఢిల్లీలో చక్రం తిప్పాలనే తాపత్రయంతో ఉన్నాయి. విపక్ష పార్టీలు భాజపాను కాకుండా మోదీని వ్యతిరేకిస్తున్నాయంటే- ఎన్డీఏకి మెజారిటీ రాకుంటే తమ మద్దతు అవసరమవుతుందని గంపెడాశలు పెట్టుకున్నాయి.
1989 నుంచి 2014 వరకు కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా నడిచింది. 2014లో ఎన్డీఏకి, అందులోనూ భాజపాకు సొంతంగా ఆధిక్యత రావడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం లేకుండాపోయింది. దాదాపు పాతికేళ్ల పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికారాన్ని అనుభవించిన ప్రాంతీయ పార్టీలు ఇపుడు జాతీయ రాజకీయాల్లో తాము కీలకం కావాలని ఉత్సాహపడుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్ బలహీనపడడం ఒక కారణమైంది. కాంగ్రెస్ పార్టీ తన శత్రువు ఎవరో గుర్తించడంలో విఫలమై, చివరికి ప్రాంతీయపార్టీ స్థాయికి చేరుకొంది. కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం ఇందుకు నిదర్శనం. భాజపాపై పోరాడుతున్న వామపక్ష పార్టీలపై రాహుల్ పోటీకి దిగడం విమర్శలకు దారితీసింది. ఇపుడు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, బిహార్‌ల్లోనే పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తోంది. తమిళనాడు, బిహార్‌ల్లో ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరింది. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తు లేకుండా కాంగ్రెస్ తన విజయావకాశాలను పోగొట్టుకుంది.
గత ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ ఐదేళ్ల విరామం తర్వాత కూడా భావసారూప్యత ఉన్న పార్టీలతో బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచడంలో విఫలమైంది. కాంగ్రెస్ వైపల్యం వల్లే- బలమైన నేత ఉన్న పార్టీగా భాజపా మరోసారి ప్రజల ముందుకు వచ్చింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ భాజపా విధానాలను విమర్శించడం మానేశాయి. మాయావతి, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, మమతా బెనర్జీ, చంద్రబాబు తదితర ప్రాంతీయ పార్టీల నేతలు మోదీని గద్దెదించితే దేశం అన్నిరకాల కష్టాల నుంచి విముక్తి పొందుతుందని ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ను వెనకేసుకుని రావడానికి ప్రాంతీయ పార్టీలు ఇష్టపడడం లేదు, రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అనివార్యంగా బలమైన నాయకుడున్న పార్టీకి ప్రాధాన్యతను ఈసారి కూడా ఇస్తారా లేదా అన్నది చూడాల్సిందే.













