పార్లమెంటు ఉభయసభలు వాయిదా
పార్లమెంటులో నిరసనల వేడి చల్లారడం లేదు. విరామం అనంతరం ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు చేతబూని చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. సభా నిర్వహణకు సభ్యులు సహకరించాలని, అన్ని అంశాలపైనా చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను రేపటికి వాయిదా పడింది.
లోక్‌సభలో మళ్లీ అదే సన్నివేశం పునరావృతమైంది. సభ ప్రారంభం కాగానే కావేరి బోర్డు అంశంపై అన్నాడీఏంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. గంట వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో అంశాలపై చర్చించాల్సి ఉన్నందున సభ్యులు సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ కోరారు. గందరగోళం మధ్యే టీడీపీ, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను సభలో చదివి వినిపించారు. అయితే సభ సజావుగా సాగితేనే అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ స్పందిస్తూ, సభలో అన్ని అంశాలపై చర్చ చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సభ్యులు ఆందోళన విరమించి సభ నిర్వహణకు సహకరించాలని కోరారు. అయినా అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.













