ఎలాంటి భద్రత లేదు : అర్థరాత్రి గవర్నర్ స్కూటర్ పర్యటన
అర్ధరాత్రి వేళ పుదుచ్చేరిలో మహిళ భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు సాక్షాత్తూ గవర్నరు ఓ అజ్ఞాత వ్యక్తి మాదిరిగా వెళ్లి పరిశీలించారు. టూవీలర్ పై వెళ్లి ప్రధాన రహదారుల్లో మహిళకు భద్రత ఎలా ఉందనేది పర్యవేక్షించారు. ఆమె మరెవరో కాదు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు కిరణ్‌బేడి. ఎవరూ ఆమెను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి చున్నీ కప్పుకున్నారు. ఎటువంటి భద్రత లేకుండా అర్ధరాత్రి వేళ ఆమె ఎంతో ధైర్యంగా స్కూటర్ పై పర్యటించారు. దీని గురించి ఆమె స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘పుదుచ్చేరిలో రాత్రివేళ బయట ఉండటం సురక్షితమే. కానీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం’. ప్రజలు తమకు ఏదైనా అవసరమైతే పీసీఆర్, 100కు ఫోన్ చేసి సహాయం తీసుకోవాలని ‘ ఆమె కోరారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఒక గవర్నర్ (మహిళ) అయి ఉండి కూడా దైర్యంగా ఇంత చక్కటి బాధ్యత తీసుకున్నారంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. ప్రతి ఒక్క నేతల్లోనూ సమాజంపట్ల శ్రద్ద అవసరముంటేనే దేశం బాగుంటుందని ట్వీట్స్ చేస్తున్నారు.













